Mirapakai Review -1



మిరపకాయ్ రివ్యూ 
 మాస్ మహారాజ్ రవితేజ సినిమా అనగానే జనాలు ఏమేం ఊహించుకుంటారో అవన్నీ కలిపి దానితోబాటే ఇద్దరు "హాట్" గా "వేడెక్కించే" ముద్దుగుమ్మలని పెట్టి షాక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆడిన సేఫ్ గేమ్ బానే పనిచేసినట్టుంది ఈసారి.ఇదివరకు రవితేజతో తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ ని నమ్ముకుని షాక్ తీసి తనే షాక్ తిన్న హరీష్ ఈసారి రవితేజ స్టైల్ ని నమ్ముకుని కథను తయారు చేసాడు. 

రవితేజ ఒక అనాథ.అతన్ని నాగేంద్రబాబు పెంచి పెద్ద చేసి ఒక పెద్ద పోలీసు ఆఫీసుర్ని చేస్తాడు. రవితేజ కు డిపార్టుమెంటులో ఒక ముద్దుపేరు ఉంటుంది మిరపకాయ్ అని.అంతే కాకుండా బాబుగారు ఎలాంటి అమ్మాయిని అయినా క్షణాల్లో లైన్లో పెట్టగల సమర్థుడు. ఈ నమ్మకం తోటే అతడికి హైదరాబాద్ లో ఒక కాలేజీ అమ్మాయిని పటాయించే పని అప్పగిస్తాడు.ఆ కాలేజీ లో లెక్చరర్ గా చేరిన రవితేజ అక్కడ వినమ్ర ని(రిచా)  చూసి ప్రేమలో పడతాడు.

ఈలోగా అదే కాలేజీ కి వైశాలి (దీక్ష) వస్తుంది. ఇంతకి ఈ వైశాలి ఎవరు. అసలు రవితేజ లైనులో పెట్టాల్సిన అమ్మాయి ఎవరు? ఎందుకు పెట్టాలి? ఏమిటి? అనేది వెండితెర మీద చూడ్డానికి వదిలేస్తున్నాం.

ఎప్పటిలాగే ఈసారి కూడా రవితేజ ఫుల్ ఎనర్జీ తో నటించాడు. కోట, ప్రకాష్ రాజ్, అజయ్, సుప్రీత్ , చంద్రమోహన్, సునీల్, గిరి మొదలగు వాళ్ళంతా వారి వారి పరిధుల్ని బట్టి నటించారు. 

ఇక గ్లామర్ విషయానికి వస్తే దీక్ష కన్నా రిచానే ఎక్కువ "వాడుకున్నారు". మొదటి రెండు సినిమాల్లోనూ (లీడర్, నాగవల్లి) అవకాశం రాకో , అవసరం లేకో పద్దతిగా నటించిన రిచా ఈ సినిమాలో నిజంగా తనేంటో "చూపించింది". ఈ సినిమాకు జనం రావడానికి మొదటి కారణం రవితేజ అయితే రెండో కారణం ఖచ్చితంగా రిచా అవుతుంది.

ఈ మధ్య రవితేజ  ప్రతి కథలోనూ విలన్ బాంకాక్ లేదా మలేసియా నుండి ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదు.
ప్రకాష్ రాజ్ డేట్స్ ఒక రెండు రోజులు తీస్కుని , ఒక 30 - 40 అంతస్తుల బిల్డింగ్ అద్దెకి తీస్కుని దానిమీదే మొత్తం సీన్స్ అన్ని షూట్ చేసినట్టున్నారు క్లైమాక్స్ తో సహా. మెయిన్ విలన్ గా అతనికన్నా సెకండ్ విలన్ అయిన కోట ఎక్కువసేపు కనిపిస్తాడు. బ్రహ్మాజీ , సుప్రీత్ మాత్రమే కొంచెం రవితేజ తర్వాత (ఒక 30 నిమిషాలు)   ఉంటారు.

రవితేజ ఉంటె చాలు ఇంకెవరు అక్కర్లేదు అనుకున్నారో ఏమో ఇంకా ఎవర్ని సరిగ్గా వాడలేదు. సునీల్ తో సహా.ఆలి, రావు రమేష్ , రాజ రవీంద్ర ఉన్న సన్నివేశాలు అయితే కేవలం వారు కూడా సినిమాలో ఉన్నారు అని చెప్పడానికి మాత్రమె పని చేస్తాయ్.  

ఎప్పటిలాగే రవితేజ తరహా డైలాగ్స్ , చిలిపి పేరుతో వెకిలి పనులు, మాటర్ కన్నా బిల్డప్ ఎక్కువ ఉండే ఫైట్స్ , ఆరు పాటలు అని కొలతలు వేస్కుని మరీ తయారు చేసాడు కథని. 

ఇక పాటల విషయానికి వస్తే తమన్ కొంచెం తరహా మారిస్తే మంచింది. మణిశర్మ , దేవి ప్లేస్ ని ఆక్రమించేసిన తమన్ ఆ క్వాలిటీ సంగీతాన్ని ఇవ్వలేకపోతున్నాడు.ఇప్పటికే బృన్దావనం, రగడ పాటల తరహాలోనే ఇవి కూడా ఉంటాయ్.

మొత్తానికి ఈ సంక్రాంతి అటు కృష్ణ కాకుండా ఇటు శంభో శివ శంభో కాకుండా యావరేజ్ గా నిలబడే అవకాసం ఉంది. ఆల్రెడీ పరమ వీర చక్ర అటకేక్కేయ్యడం కూడా ఈ సినిమాను ఇంకో రెండు వారాలు నిలబెట్టచ్చు. కానీ రవితేజ ఇక తన సినిమాల స్టైల్ మార్చడం మాత్రం మంచిది.




Share your views...

0 Respones to "Mirapakai Review -1"

Post a Comment

 

© 2010 TollyTown All Rights Reserved Thesis WordPress Theme Converted into Blogger Template by Hack Tutors.info